వృద్ధిపధంలో భారత్ - అమెరికా సంబంధాలు
అమెరికా దక్షిణ, మధ్య ఆసియాల వ్యవహారాల విదేశాంగ సహాయమంత్రి ఎలిస్ వెల్స్, ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు డిప్యూటీ మాథ్యూ పొటింగర్ లు భారత్ కు వచ్చి పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొనడంతో పాటు 5వ రైసినా డైలాగ్ సదస్సులో కూడా పాలుపంచుకున్నారు. అలిస్ వెల్స్ తన ఉపఖండ పర్యటనలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంకలను కూడా సందర్శించారు.
ఇండో పసిఫిక్ ప్రాంతంపై ఎంతో కీలక దృష్టి వుండాలని - మాథ్యూ పొటింగర్ రైసినా డైలాగ్ లో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతం చట్టాలను గౌరవించే దేశాలతో కూడుకున్నదని అన్నారు.
సముద్ర జలాల రవాణా స్వేచ్ఛను, దానిపైనున్న ఆకాశ గమనాన్ని కాపాడుతూ, స్వేచ్ఛా వాణిజ్యానికి తావునిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా - ఆ ప్రాంతంలోని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవాన్ని కాపాడే ప్రాంతం ఇండో పసిఫిక్ అని ఆయన అభివర్ణించారు. ఈ ప్రాంతం స్వేచ్ఛాయుతమైనదని ఏ దేశాన్ని తప్పించదని, అయితే మన దేశాలన్నీ ఉమ్మడిగా విశ్వసించే వాటిని ప్రతి దేశం గౌరవించాలని కోరుకుంటోందని పొటింగర్ అన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంత స్వేచ్ఛను అభిలషించేవారు ఆయా దేశాల ప్రజల అభిష్టానికి అనుగుణంగా వుండాలని, ప్రభుత్వాల దృష్టి కోణంతో చూడరాదని అమెరికా విదేశాంగ సహాయ మంత్రి ఎలిస్‌వెల్స్ పేర్కొన్నారు. రైసినా డైలాగ్ సదస్సులో పాల్గొనడంతో పాటూ - 2020 ఫిబ్రవరిలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రంగం సిద్ధం చేయటం కూడా ఎరిస్ వెల్స్ అజెండాలో వుంది. ట్రంప్ పర్యటన గనుక ఖరారు అయితే - 2016లో అధికారం చేపట్టిన తరువాత ఆయన తొలి భారత పర్యటన ఇది అవుతుంది. ప్రధాని నరేంద్రమోది అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య పటిష్ట సంబంధాలు వున్నాయన్న విషయం 2019లో టెక్సాస్ జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలోనే విదితమయ్యింది.
భారత్ - అమెరికా దేశాలు తమ మధ్య వున్న వ్యూహాత్మక సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే వెల్స్ పర్యటనను చూడాలి. గత సంవత్సరం వాషింగ్టన్ లో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ, పౌర రంగాల్లో అనేక ఒప్పందాలు కుదిరాయి. భారత్ - అమెరికా దేశాలు కీలక రక్షణ సమాచారాన్ని పంచుకునేందుకు ఇరు దేశాలు ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఎనెక్స్ (ISA)పై సంతకాలు చేశాయి. డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ (DTTI)లో చెప్పుకోదగ్గ పురోగతిని సాధించినట్లు కూడా ప్రకటించాయి.
ఈ రెండు చర్యలు కూడా రక్షణ ఉత్పత్తి రంగంలోని ఇరుదేశాలలో గల ప్రైవేటు సంస్థలు చేతులు కలిపేందుకు దోహద పడతాయి. రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలకు కూడా కలసి పని చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
ఎలిస్ వెల్స్ భారత్ ప్రభుత్వ అధికారులతో పాటూ, పుర ప్రముఖులు, ఇతరులతో సమావేశమై - ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఆవశ్యకత, దాని మూలంగా - ప్రజాస్వామ్యపరంగా, సంపదపరంగా కలిగే ప్రయోజనాలను చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహాయ సహకారాల వృద్ధికి ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా దేశాలు చేస్తున్న కృషికి వెల్స్ పర్యటన మరింతగా దోహదపడింది.
ఎలిస్ వెల్స్ - భారత్ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో కూడా సమావేశమై చర్చలు జరిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల అంశాలపై ఇరు దేశాలు చర్చించాయి. వ్యవసాయం, డైరీ రంగాల విషయంలో భిన్న అభిప్రాయాలపై కూడా చర్చించారు. దేశీయ పరిశ్రమలకు కల్పించే సబ్సిడీల అంశంపై కూడా చర్చలు జరిగాయి.
గత రెండు దశాబ్దాల కాలంలో భారత్ - అమెరికా సంబంధాల్లో పెను మార్పులు వచ్చాయి. ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేయని ఒక అంశం కూడా లేదు. గత రెండు దశాబ్దాల కాలంలో విస్తరించిన ద్వైపాక్షిక భాగస్వామ్య నేపథ్యంలో - ప్రస్తుత సంయుక్త కార్యకలాపాలు మరింత వేగవంతమయ్యాయి.
ఇరుదేశాధినేతల తరచు సమావేశాలతో పాటూ - ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారుల సమావేశాలు కూడా తరచూ జరుగుతున్నాయి. రక్షణ, ఉగ్రవాద నిర్మూలన, అంతర్గత భద్రత, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక అంశాలలోనే కాకుండా ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, ప్రజారోగ్యం, సాంస్కృతిక రంగాలలో కూడా భారత్ - అమెరికా దేశాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి.
రచన : డా.స్తుతి బెనర్జీ, అమెరికా వ్యవహారాల విశ్లేషకులు
Comments
Post a Comment