భార‌త‌-న్యూజిలాండ్ సంబంధాలు: ఇండో-ప‌సిఫిక్ ప్రాంతీయ ఏకీక‌ర‌ణ‌కు ప్రోత్సాహం

భార‌త‌-న్యూజిలాండ్ స్నేహ‌సంబంధాల విష‌యంలో 2020 సంవ‌త్స‌రం ఆశావహంగా మొద‌లైంది. ముఖ్యంగా న్యూజిలాండ్ వ‌ల‌స వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఇయాన్ లీస్‌-గాలోవే గ‌త‌నెల ముంబై సంద‌ర్శించి వెళ్లాక ఈ అంశం ప్ర‌స్ఫుట‌మైంది. ఆ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రిలో న్యూజిలాండ్ ఉప ప్ర‌ధాని-విదేశాంగ శాఖ మంత్రి విన్‌స్ట‌న్ పీట‌ర్స్‌, వాణిజ్య‌శాఖ మంత్రి డేవిడ్ పార్క‌ర్‌లతోపాటు వాణిజ్య ప్ర‌తినిధి బృందం భార‌త్‌లో ప‌ర్య‌టించ‌డం మ‌రింత ప్రాముఖ్యం సంత‌రించుకుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లతో రెండు దేశాల మ‌ధ్య‌ సంబంధాల్లో ఏకీక‌ర‌ణ‌కు అవ‌కాశంగల కొన్ని ముఖ్య‌మైన రంగాల్లో స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారానికి వీలుంటుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. భార‌త‌-న్యూజిలాండ్ న‌డుమ చారిత్ర‌కంగా అనేక పోలిక‌లున్నాయి... రెండు దేశాల్లోనూ బ్రిటిష్ వ‌ల‌సపాల‌న వార‌సత్వం క‌నిపిస్తుంది. అలాగే పార్ల‌మెంట‌రీ పాల‌న విధానం ప‌రిణామం చెందింది. అంతేకాకుండా కామ‌న్‌వెల్త్ కూట‌మిలో ఉమ్మ‌డి అనుబంధం కూడా కొన‌సాగుతోంది. వీట‌న్నిటి మాట అటుంచి- ప‌ర‌స్ప‌ర ఏకీక‌ర‌ణ‌, ఆసక్తిగ‌ల రంగాల‌ను గుర్తించేందుకు ద్వైపాక్షికంగానేగాక ఇండో-ప‌సిఫిక్ విస్తృత ప్ర‌యోజ‌నాల దృష్ట్యా సునిశిత‌, ప్ర‌త్యేక ప‌థాన్ని రూపొందించాల‌ని రెండు దేశాలూ గాఢంగా ఆకాంక్షిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ‘‘భారత్-2025...స్నేహానుబంధంపై దృష్టి’’ శీర్షిక‌న‌ న్యూజిలాండ్ ఉప ప్ర‌ధాని ఒక స‌రికొత్త వ్యూహాత్మ‌క ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. నిర్దిష్ట కీల‌క రంగాల‌తోపాటు మ‌రికొన్నిటిలో స్నేహాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌వ‌చ్చున‌ని అందులో ప్ర‌తిపాదించారు. రెండు దేశాల మ‌ధ్య వాణిజ్యానికి ప్రోత్సాహంపై ద్వైపాక్షికంగా నిశిత దృష్టి సారించాల్సిన అవ‌స‌రం మీద‌నే ప్ర‌ధానంగా ఈ సంబంధాలు కేంద్రీకృత‌మ‌య్యాయి. న్యూజిలాండ్ ప్ర‌ముఖుల ప‌ర్య‌ట‌న‌లోని కీల‌కోద్దేశం ఇదే. రెండు దేశాల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర వ‌స్తు వాణిజ్యం దాదాపు 1.5 బిలియ‌న్ న్యూజిలాండ్ డాల‌ర్ల మేర, వ‌స్తుసేవ‌లు రెండూ క‌లిపి 2.64 బిలియ‌న్ డాల‌ర్లదాకా నమోదు కాగా, సాపేక్షంగా ఇది చాలా త‌క్కువ‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో ప‌ర‌స్ప‌ర వాణిజ్య ఆదాన‌ప్రదానాల‌ను పెంచ‌డంపైనే న్యూజిలాండ్‌ వాణిజ్య మంత్రి, ప్రతినిధి బృందం దృష్టిపెట్టారు. త‌ద‌నుగుణంగా రెండు దేశాలూ ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంవైపు మ‌ళ్ల‌డానికిగ‌ల అవ‌కాశాల‌ను అన్వేషించాల‌ని వారు భావించారు. మ‌రోవైపు భారీ వాణిజ్య కూట‌మి అయిన స‌మ‌గ్ర ప్రాంతీయ ఆర్థిక భాగ‌స్వామ్య ఒప్పందం-RCEP నుంచి వైదొల‌గిన నేప‌థ్యంలో న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్ర‌గ‌తిపై భార‌త్ కూడా ఆస‌క్తి చూపింది.

ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మ‌క వాస్త‌వాల‌ను న్యూజిలాండ్ ఇటీవ‌లే గుర్తించ‌డం ప్రారంభించింది. ఆ మేర‌కు ప్రాంతీయంగా మ‌రింత పెద్ద చ‌ట్రం ప‌రిధిలో భార‌త‌దేశంతో స‌న్నిహిత సంబంధాల ప్రాముఖ్యాన్ని స్ప‌ష్టంగా అవ‌గ‌తం చేసుకుంటోంది. ఇంతకుముందు త‌మ విదేశాంగ విధానానికి కీల‌క‌మైన ‘ఆసియా-ప‌సిఫిక్’ అనే ప‌ద ప్ర‌యోగంవైపే న్యూజిలాండ్ మొగ్గుచూపేది. అందుకే - నిన్న‌మొన్న‌టిదాకా ఇండో-ప‌సిఫిక్ అని ఉచ్చ‌రించ‌డానికి కూడా ఇచ్చ‌గించేది కాదు. అంత‌ర్జాతీయ స్థాయిలో మ‌రింత స‌హ‌కారం దిశ‌గా ఈ ప్రాంత ఆర్థిక వాస్త‌వాలే న్యూజిలాండ్‌ను అలా న‌డిపించాయి. భౌగోళికంగా ప‌సిఫిక్ మ‌హా స‌ముద్రం ద‌క్షిణ‌పు చివ‌ర‌న ఉందిగనుక తమ జాతీయ ప్ర‌యోజ‌నాలు అత్య‌ధికంగా నెర‌వేరే మార్గంలో యుక్తియుక్తంగా ఆసియా ప‌సిఫిక్‌ను గుర్తించింది.

ఏదేమైనా ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ క్ర‌మాల నిర్మాణాన్ని మార్చేస్తున్న ప్ర‌స్తుత అనివార్య‌ భౌగోళిక‌-రాజ‌కీయ‌ ప‌రిస్థితుల్లో న్యూజిలాండ్ మాత్ర‌మేగాక అనేక పసిఫిక్ ప్రాంతీయ దేశాలు త‌మ సంప్ర‌దాయక ప‌ద్ధ‌తుల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌క త‌ప్ప‌డం లేదు. అందువల్లనే న్యూజిలాండ్ ఇటీవ‌ల ఇండో-ప‌సిఫిక్‌ను గుర్తించ‌డంద్వారా త‌మ విదేశాంగ విధానాన్ని స‌వ‌రించుకుంటూ భార‌త్‌తో స‌న్నిహితం కాగ‌ల కొత్త రంగాల్లో చేయిక‌లిపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు హిందూ మ‌హాస‌ముద్ర ప‌రిధిలో త‌న స్థానంస‌హా ఇండో-ప‌సిఫిక్ తీర ప్రాంతంలో విశాల‌, దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల దృష్ట్యా కూడా భార‌త‌దేశానికి కీల‌క ప్రాముఖ్యం ఉంది. అంతేగాక స‌ముద్రాల వినియోగంపై ఐక్యరాజ్యసమితి తీర్మాన ఆధారిత‌ సూత్రాలు, సముద్ర సంబంధ అంశాల్లో ఒక నియమావళి ఆధారిత క్రమాన్ని ప్రోత్సహించ‌డంలోనూ రెండుదేశాల సాన్నిహిత్యానికి తోడ్పడే స్ప‌ష్ట‌మైన అంశాలున్నాయి. కాబట్టి భవిష్యత్ ద్వైపాక్షిక చర్చలలో రెండు దేశాలూ దీనిపైనే ప్ర‌ధానంగా దృష్టి సారిస్తాయని చెప్పవచ్చు.

బహుపాక్షిక స్థాయిలో రెండు దేశాలూ ప‌లు వ్య‌వ‌స్థీకృత యంత్రాంగాల్లో భాగంగా ఉన్నాయి. అలాగే తూర్పు ఆసియా కూట‌మి స‌దస్సు, ఆసియాన్ రక్షణ మంత్రుల అద‌న‌పు సమావేశం మరో రెండు ప్ర‌ధాన వేదిక‌లుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. త‌ద్వారా ప్రాంతీయ స్థాయిలో రెండు దేశాలూ త‌మ చ‌ర్చ‌ల‌ను మరింత ముందుకు తీసుకెళ్లే వీలుంటుంది. సాధార‌ణ క్ర‌మానికి క‌ట్టుబ‌డుతూ ప్రాంతీయ స్థాయిలో శాంతి, సుస్థిర‌త‌లను ప్రోదిచేసేందుకు త‌గిన చ‌ర్చ‌నీయాంశాల రూప‌క‌ల్ప‌న‌కు అవ‌కాశం ల‌భిస్తుంది. ఆ మేర‌కు భార‌త్ త‌న ప‌సిఫిక్ ప్రాంతీయ ముద్ర‌ను కొన‌సాగించేలా విదేశీ విధానాన్ని రూపుదిద్దితే, న్యూజిలాండ్ క్ర‌మేణా అందులో కీల‌క పాత్ర పోషిస్తుంద‌న‌డంలో సందేహం లేదు!





రచన: ప్రొఫెస‌ర్ శంక‌రి సుంద‌ర‌రామ‌న్‌, ఇండో-ప‌సిఫిక్ అధ్య‌య‌న కేంద్రం, ఎస్ఐఎస్‌, జేఎన్‌యూ

Comments

Popular posts from this blog

ಆಲಿಪ್ತ ದೇಶಗಳ ಮುಂದಿರುವ ಸವಾಲು

ಬಿರುಸುಗೊಂಡ ಯುಸ್ ಅಧ್ಯಕ್ಷೀಯ ಚುನಾವಣೆ

ಸಿಪಿಇಸಿ: ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಾಲದ ಹೊರೆ